ఆత్మ ఏమిటి?
ఆత్మను ఎలా అర్థం చేసుకోవాలి?
గీతలో నిర్వచనం
ఆత్మ గురించి మన గీతా శాస్త్రంలోని సాంఖ్యయోగంలో చాలా చక్కటి వివరణ ఉంది.
(అ) సూక్ష్మమైనది, తడవదు, కాలదు, భేదింపబడదు, అగ్రాహ్యం, అచింత్యం…వగైరాలు. ఈ ఆత్మనే…పరమాత్మ అని కూడా చెప్పింది. ఇవన్నీ ఆత్మయొక్క ధర్మాలుగా తెలుస్తుంది కానీ, స్పష్టంగా ఆత్మ అంటే తెలియదు.
ఈ ధర్మాలతో పాటు గీతలోనే ఈ ‘ఆత్మ’ అన్న పదము, దేహము, మనస్సు, బుద్ధి అని చెప్పటానికి కూడా వాడబడింది, విషయం మరింత అస్పష్టం అయ్యింది. వేరే పదాలు (మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము అంటూ) ఉండగా ఈ పదము ఎందుకు వాడవలసి వచ్చిందో నాకు తెలిసి ఎక్కడా చెప్పలేదు. బహుశా ఛందస్సుకు లోబడి అలా చేశి ఉండవచ్చును.(ఛందస్సు - ఇదేమిటి? గీతలో ఒకటి రెండు తప్ప అన్నీ శ్లోకాలే: శ్లోకానికి నిర్వచనమేమటంటే, రెండు పాదాలుండి, ప్రతి పాదంలో 16 అక్షరాలుండాలి. ఆ క్రమం కోసం -అవసరమైనప్పుడు మనస్సు, దేహం, బుద్ధి ఉండవలసిన చోట- ఆత్మ పదాన్నే వాడారేమో. మరి పూర్వంలో, ఇందువల్లన చదువరులకు ఇబ్బందిలేదా అంటే, పూర్వ కాలంలో గురుకులాలలో గురువు దగ్గరుండి అన్నీ బోధించేవాడు కనుక అనుమానాలొస్తే తొలగి పోయేవి. పైగా గురుకులాలలో రాజులు, బ్రాహ్మణులు, ఎవరో ముఖ్యులు తప్ప, సామాన్య జనులకు అవకాశం లేదు. అందువల్ల సామాన్యులకు ఈ జ్ఞానం లభించ లేదు. ఇప్పుడంటే, మనకు శాస్త్రాలన్నీ పుస్తకాలుగా ముద్రించబడి అన్ని చోట్లా దొరుకుతున్నాయి)
ఆత్మ అన్న మాటకు పైన (అ) లో చెప్పిన విశేషణాలతో ఏదో కొంచెం అర్థమవుతున్నట్లు ఉంటుంది కానీ, అసందిగ్థంగానే ఉంది.
ఒక ఉదాహరణతో మెరుగైన అర్థం తెలుస్తుంది అనుకుంటాను( కానీ కచ్ఛితమైన అర్థము కాదు).
ఆత్మను విద్యుత్తు కరెంటుతో /పెట్రోలుతో పోలుస్తున్నాను. మనకు చాలా రకాల టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లూ, మోటరు సెకిళ్ళూ వగైరా వగైరాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వేరువేరు రంగులతో, సామర్ధ్యంతో, ఆకారాలతో…ఉంటుంది. దేనికదే అన్నట్లు భేదాలూ, తేడాలూ ఉంటాయి. అయితే ఎంత గొప్ప సామర్థ్యమున్నా, ఆకారమున్నా, రంగులున్నా, విద్యుత్తులేనిదే టీవీలు, రిఫ్రిజిరేటర్లూ పనిచేయవు, పెట్రోలు లేందే కార్లు, మోటార్లూ నడవవు.
విద్యుత్తు, పెట్రోలు వస్తువలపై (టీవీ..కారూ..) పనిచేశాకే వాటిలో చలనం. లేకుంటే అవి చచ్చినట్లే. “ఇవి” ఉంటేనే “అవి” కదులుతాయి, కనపడతాయి, వినపడతాయి. అందువల్లన “ఇవి” కారణం, “అవి” కార్యం, నడిపేది వేరు, నడిచేది వేరు- ఈ విషయం మనం నిత్యజీవితంలో చూడగలుగుతున్నాం కనుక అర్ధమయింది.
కానీ జీవులలో ఉండి, జీవులను నడిపే ఆత్మను చూడలేం- ఎందుకంటే, చూడటానికి అవసరమైన కళ్ళు, గ్రహించటానికి అవసరమైన మనస్సు, బుద్ధి కూడా ఆత్మ వల్లనే పనిచేస్తాయి కనుక. ఈ పనిచేయటాన్నే ”చైతన్యం” అంటారు, జీవి అంటారు, లేక పోతే “శవం” అంటారు. “ఆత్మ” ముందు, “ఇవి” (మనస్సు, బుద్ధి…లు) తరవాత.
అలాగే, ఈ ఆత్మ ఉంటేనే జీవులలో చైతన్యముంటుంది. ఎవరైనా, ఎలాంటి వారైనా, జంతువైనా,క్రిమి అయినా, పక్షి అయినా.
ఈ చైతన్యమే మనలో ఇంద్రియాలు పనిచేయటానికి కారణం. ఆ చైతన్యమే మనలో “నేను” అన్న భావన కలిగిస్తుంది. ఈ “నేను” అన్న భావన ఏ స్థాయిలో పని చేస్తుందో - దేహం, మనస్సు, బుద్ధి….- ఆ స్థాయిలో మనం మమేకం (కలిసి) అవుతాం, ఆ స్థాయిలోని వస్తువు (శరీరం, మనస్సు, జ్ఞాన, కర్మ ఇంద్రియాలు) “నేను” అంటూంటాం, అనుకుంటాం.
శరీరంలో ప్రతి జీవకణాంలోనూ చైతన్యం ఉంటుంది, ఆత్మ ఉన్నంత కాలం, తొలగగానే ప్రతి కణమూ చనిపోతుంది.
జీవాత్మ అంటే?
జీవమున్న ప్రతి వస్తువులో ఆత్మ ఉండి, ఏదో చలనము ఉంటుంది.
జీవి+ఆత్మ = జీవుడు,
జీవి -ఆత్మ = శవం
———————————స్వస్తి———————————
Comments
Post a Comment